గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (10:49 IST)

కాంగ్రెస్ పార్టీలోకి పీకేకు ఆహ్వానం - స్పష్టమైన కార్యాచరణతో వ్యూహాలు

prashanth kishore
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. పీకేను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యువనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పదేపదే కోరుతున్నారు. ముఖ్యంగా, 2024 ఎన్నికల్లో పార్టీని తిరిగి విజయపథంలో నడిపించేందుకు వారు సర్వశక్తులా పోరాడుతున్నారు. 
 
ఇందులోభాగంగా, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) మధ్య శనివారం చర్చించిన కీలక అంశాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి నాయకుడిగా పనిచేయాలని పీకేను సోనియాగాంధీ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. 
 
ఇందుకోసం పీకే ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులను సూచించారు. ముఖ్యంగా సమాచార సంబంధాల విభాగాన్ని పూర్తిగా సంస్కరించాలని ఆయన ప్రధానంగా సూచన చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింతగా దృష్టిసారించాలని కోరారు. 
 
మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు.  'ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదన అందించారు. పార్టీ నేతల బృందం దీన్ని చూస్తుంది. ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించేది పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు' అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.