గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (10:38 IST)

కొత్త పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ప్రారంభిస్తారు? రాహుల్ ప్రశ్న

rahul gandhi
దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదని, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండడంపై ట్విటర్ వేదికగా రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధానిని కలిసి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. దీంతో రాహుల్‌తో పాటు అనేక విపక్ష నేతలు తమ నిరసన గళం వినిపించారు.

'కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగబద్ధం కాదు. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్‌కు రాష్ట్రపతే అధిపతి. కాబట్టి దానిని రాష్ట్రపతి ప్రారంభించాలి' అని కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ను ప్రధాని ప్రారంభించమేంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే ప్రారంభించడం సముచితమని సీపీఐ జాతీయ నేత డి.రాజా అన్నారు.