ఒకే దేశం ఒకే విద్యావిధానం... ప్రధాని మోదీ వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నూతన విద్యావిధానంతో విద్యా వ్యవస్థ రూపురేకలు మారిపోనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఈ విద్యావిధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విద్యావిధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
కొత్త విద్యా విధానంలో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుంది. అదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని మోదీ చెప్పారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుంది. నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకోవచ్చామన్నారు.
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలన్నదే జాతీయ విద్యా విధానం లక్ష్యమన్నారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు దిశగా యువత ఆలోచనలు సాగాలన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దని కోరారు.