అద్వానీ పేరెత్తని ప్రధాని మోదీ.. కారణం అదేనా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పేరెత్తలేదు. తన కీలక ప్రసంగంలో ఎక్కడా మోదీ అద్వానీ మాటెత్తలేదు. మోదీయే కాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం, అద్వాణీ పేరు ఎత్తకుండా తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.
1990 'రామ్ రథయాత్ర' పేరుతో అద్వానీ చేపట్టిన దేశవ్యాప్త పర్యటన మందిర నిర్మాణం కోసం దేశ ప్రజల నుంచి విశేష మద్దతును కూడగట్టగలిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మందిర నిర్మాణం చేపడుతున్న స్థలంలో ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ కీలకంగా ఉన్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి.
కానీ అద్వానీని కావాలనే పక్కన పెడుతున్నారనే విమర్శ మోదీ, అమిత్ షాలపై ఎప్పటి నుంచో ఉంది. అందుకే శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఈ విమర్శలను మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
బాబ్రీ మసీదు వివాదంలో అద్వానీ పేరు వినిపించడంతో మోదీ ఆయనను ఆహ్వానించలేదని టాక్ వస్తోంది. రామ యాత్రను ప్రారంభించినా.. బాబ్రీ వివాదంలో అద్వానీ పేరు వినిపిస్తున్న తరుణంలో ఆయనను రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు పిలవడం అంత మంచిది కాదని.. మోదీ భావించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే అద్వానీని ఆయన ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయినా మోదీ అద్వానీని లెక్కచేయకపోవడం ఇది కొత్త కాదని.. పలు సందర్భాల్లో ఆయనను నిర్లక్ష్యం చేసిన దాఖలాలు వున్నాయని బీజేపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.