గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జులై 2020 (08:56 IST)

ప్రియాంకా గాంధీకి షాకిచ్చిన కేంద్రం - నెల రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!

కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీకి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. ఢిల్లీలోని లోధీ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రతలో లేనందువల్ల బంగ్లాను ఖాళీ చేయాలని తెలిపింది. 
 
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు అనేక మంది వీవీఐపీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్పీజీ భద్రతను తగ్గించిన విషయం తెల్సిందే. దీంతో ప్రియాంకా గాంధీకి కల్పిస్తూ వచ్చిన ఎస్పీజీ భద్రతను కూడా తొలగించారు. 
 
దీంతో ఆమె ఉంటున్న అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత కూడా బంగ్లాలో ఉంటే డ్యామేజీ ఛార్జీలు, రెంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఈ చేసింది.
 
గతంలో ఎస్పీజీ ప్రొటెక్షన్‌లో ఉన్న ప్రియాంకకు 1997 ఫిబ్రవరి 21న లోధీ ఎస్టేట్ బంగ్లాను కేటాయించారు. గత నవంబరులో ప్రియాంకకు ఎస్పీజీ సెక్యూరిటీని తొలగించి, జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, కేంద్ర హోంశాఖ సిఫారసు ఉంటేనే జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి నివాస సదుపాయాన్ని కల్పిస్తారు.