శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (19:15 IST)

27 క్రిమి సంహారక మందులపై నిషేధం

మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించింది.

మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసింది. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్‌ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించింది. నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించింది.

మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి చెప్పారు. డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగం వలన పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి చెప్పారు.

క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచుగా సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు.