1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (18:04 IST)

నింగికెగసిన పీఎస్‌ఎల్‌వీ - సీ27... ప్రయోగం సక్సెస్..!

భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పీఎస్ఎల్వీ సి 27 రాకెట్ విజయవంతంగా నింగికెగిసింది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. 
 
సొంత నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు ఉద్దేశించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.  రూ. 125 కోట్ల ఖర్చుతో తయారైన ఈ ఉపగ్రహం 1425 కిలోల బరువు గలది. భారత నావిగేషన్ వ్యవస్థ మొత్తం ఏడు ఉపగ్రహాలతో కూడినది. తాజా ఉపగ్రహంతో కలిపి ఇప్పటివరకు నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. కాగా మరో మూడింటిని ప్రయోగించాల్సి ఉంది.
 
కాగా ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శుక్రవారం, పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్‌ను పరిశీలించారు. మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చుకునేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుట్టింది.