శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (10:21 IST)

బీజేపీ కుట్ర ఫలితమే పుల్వామా : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా సంచలన ఆరోపణలు చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గత ఫిబ్రవరి నెల 14వ తేదీన ఉగ్రవాదదాడి వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. గతంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా తరహా ఘటన వంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడికి అవసరమైన ఆర్డీఎక్స్‌ పేలుడు పదార్థాలను తరలించేందుకు ఉపయోగించిన వాహనం రిజిస్ట్రేషన్ నంబరు గుజరాత్ రాష్ట్రానికి చెందినదని ఈ ఎన్సీపీ నేత ఆరోపిస్తున్నారు.
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్ళకాలంలో దేశవ్యాప్తంగా అనేక దాడులు జరిగాయని గుర్తు చేసిన శంకర్ సిన్హ్ వాఘేలా... సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం పుల్వామా దాడి ఘటనను బీజేపీ నేతలు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. 
 
అదేసమయంలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానికదళం పీవోకేలోని బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన దాడుల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు. ముఖ్యంగా, 200 మంది తీవ్రవాదులు చనిపోయినట్టు ఏ ఒక్క అంతర్జాతీయ సంస్థ కూడా వెల్లడించలేదని చెప్పారు. బాలాకోట్ వైమానిక దాడులు పక్కా కుట్ర అని ఆయన ఆరోపించారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ముందు నిఘా సంస్థలు హెచ్చరికలు చేసినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా... ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలకు సంబంధించిన సమాచారం ముందుకు ఉంటే.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కాగా, 26 లోక్‌సభ సీట్లున్న గుజరాత్ రాష్ట్రంలో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ ముగిసింది.