శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (09:19 IST)

లోక్‌సభ ఎన్నికలు : ప్రశాంతంగా సాగుతున్న నాలుగో దశ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో దశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగో దశ పోలింగ్‌ జరుగుతున్న 71 స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 45, దానిమిత్రపక్షాలు 11 స్థానాలు గెలుచుకున్నాయి. తొలి మూడు దశల్లో 302 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. బీజేపీ సంఖ్యాబలం 100 సీట్లకు మించకపోవచ్చునని, మిగతా దశల్లో జరిగే ఎన్నికలే తమకు కీలకమని ఆ పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.
 
ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్ఛేరిలోని 130 స్థానాల్లో 15 స్థానాలు కూడా బీజేపీకి దక్కవని అంచనా. గుజరాత్‌, అసోం, ఉత్తరాఖండ్‌, ఛత్తీ‌స్‌గఢ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో 35 నుంచి 40 స్థానాల వరకూ వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, సోమవారంతో మహారాష్ట్ర, ఒడిసా రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగుస్తుంది. 
 
మహారాష్ట్రలో ఇప్పటివరకూ 31 స్థానాల్లో ఎన్నికలు పూర్తి కాగా.. మిగిలిన 17 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరుగనుంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఉన్న ఆరు నియోజకవర్గాలు... బీజేపీ - శివసేనకు సంబంధించి కీలకమైనవి. కేంద్ర మాజీమంత్రి మురళీ దేవ్‌రా కుమారుడు మిలింద్‌ దేవ్‌రా, సినీనటుడు సంజయ్‌ దత్‌ సోదరి ప్రియాదత్‌, సినీనటి ఊర్మిళా మటోండ్కర్‌.. బీజేపీ - శివసేన అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు.