1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (08:30 IST)

నేడు పంజాబ్ ముఖ్యమంత్రి వివాహం.. వధువు ఎవరంటే..!

bhagwant mann
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ (48) వివాహం గురువారం జరుగనుంది. ఆయన వివాహం 32 యేళ్ల డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో చండీగఢ్‌లో జరుగుతుంది. నిజానికి ఈయనకు గతంలో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ళ క్రితం ఆమెకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం వీరంతా అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇపుడు డాక్టర్ గురుప్రీత్ సింగ్‌ను పెళ్లాడనున్నారు. 
 
ఈమె హర్యానాలోని పిహోవా ప్రాంత రైతు ఇందర్‌జిత్‌ సింగ్‌ కుమార్తె. మౌలానా వైద్య కళాశాలలో గోల్డ్‌ మెడలిస్ట్‌. రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఇటీవలి పంజాబ్‌ ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో ఈమె మాన్‌కు సహకరించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా సన్నిహిత వర్గాల సమాచారం.
 
చండీగఢ్‌ సెక్టార్‌ 8లోని ఓ గురుద్వారాలో అత్యంత నిరాడంబరంగా, అతికొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ అతిథిగా హాజరు కానున్నారు. మార్చి 16న పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణస్వీకారం చేసినపుడు ఆ వేడుకకు పిల్లలు సీరత్‌ (21), దిల్షాన్‌ (17) ఇద్దరూ హాజరయ్యారు.