సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (21:40 IST)

అధికారంలోకి వస్తే కనీస ఆదాయానికి గ్యారెంటీ : రాహుల్ గాంధీ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేదలకు అత్యంత కీలకమైన హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం ఉండేలా చేస్తామని చెప్పారు. ఆకలి, పేదరికాన్ని నిర్మూలించేందుకే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని అటల్ నగర్‌లో జరిగిన రైతు సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లక్షలాది మంది సోదర, సోదరీమణులు పేదరికంతో, ఆకలితో బాధపడుతుంటే... మనం నవభారతాన్ని నిర్మించలేమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రతి పేదవాడికి కనీస ఆదాయ హామీని ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. 
 
అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో అన్నదాతలకు రుణమాఫీ చెక్కులు అందించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. బీజేపీ వాళ్ల దగ్గర రుణమాఫీకి డబ్బులు లేవన్నారని, వాళ్లు 15 యేళ్లుగా చేయలేని పనిని తాము 24 గంటల్లో చేసి చూపించామని చెప్పారు. 
 
దేశంలో హరితవిప్లవం తెచ్చి, ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని రాహుల్ గుర్తుచేశారు. ప్రపంచంలో అమెరికా, జపాన్.. ఇలా ఎక్కడైనా భారత్‌లో రైతులు పండించిన పంటలు తింటున్నారన్నారు. 
 
రైతుల నుంచి కంపెనీలు, పరిశ్రమలు ఏవైనా భూమి సేకరిస్తే నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం ఇచ్చేలా భూసేకరణ బిల్లును కాంగ్రెస్ తెచ్చిందని రాహుల్ చెప్పారు. పదేళ్లలోపు తీసుకున్న భూమిని పరిశ్రమలు వాడకుంటే తిరిగి రైతులకు ఇచ్చేలా బిల్లులో పెట్టామన్నారు. కానీ దాన్ని బీజేపీ అధికారంలోకి రాగానే నీరు గార్చేసిందని రాహుల్  ఆరోపించారు.