1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:26 IST)

రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయాలు.. నలుగురు మంత్రులపై వేటు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలో అంతర్గత పోరు ఆకాశానికి తాకింది. ఫలితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరాజే సింథియా సిఫార్సుల మేరకు పార్టీ హైకమాండ్ నలుగురు మంత్రులపై వేటు వేసింది. 
 
ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీని వీడగా, మరికొందరు తిరుగుబాటు గళమెత్తారు. అలా తిరుగుబాటు చేసిన నేతలపై భాజపా క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. 11 మంది రెబల్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉండటం గమనార్హం.
 
వీరంతా తమ నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 11 మంది సీనియర్‌ నేతలను ఆరు సంవత్సరాల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ వీరికి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన వీరు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు.
 
ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే భాజపాకు ఈ రెబల్స్‌ సమస్య మొదలైంది. ఇప్పటికే కొందరు సిట్టింట్‌ ఎమ్మెల్యేలు టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాగా, రాష్ట్రంలో డిసెంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.