బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (13:59 IST)

కోట్లాదిమంది కోరిక నెరవేరింది.. అయోధ్యలో భూమిపూజ ముగిసింది..

Ayodhya
కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రాముడి మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం పూర్తయింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, రామ మందిరం ట్రస్ట్ ఛైర్మన్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఈ ఐదు వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమశాస్త్ర పండితుల భావన. 
 
భూమిపూజలో హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను వినియోగించారు. మరోవైపు భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. భూమిపూజ పూర్తైన వెంటనే ప్రధాని మోడీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 
 
మరోవైపు అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిరం.. రామాయణంలోని సిద్ధాంతాలు, విలువలకు అద్దం పడుతుందని, ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు. చట్టబద్ధంగా నిర్మిస్తున్న రామాలయం భారతదేశం యొక్క సామాజిక సామరస్యం, ప్రజల ఆంకాక్షకు ప్రతిరూపమని అన్నారు. 
 
బుధవారం జరిగిన భూమిపూజలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
 
అయోధ్యలోని వివాదస్పద రామజన్మభూమి రామ్‌లల్లాకే చెందుతుందని గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశప్రజలు ఎంతో పరిణితి ప్రదర్శించారని, ప్రజాస్వామ్య సంస్థల విలువలను చాటారంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాడు ప్రశంసించారు.