శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (21:58 IST)

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వడానికి కట్టుబడి వున్నాం: మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కాశ్మీర్‌కు చెందిన 14మంది నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్​ షా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ జాతీయ ప్రయోజనాల కోసం, జమ్మూకాశ్మీర్​ ప్రయోజనాల కోసం పనిచేయాలని ప్రధాని మోదీ ఈ సమావేశంలో నేతలను కోరారు.

జమ్మూకాశ్మీర్​లో ప్రతి ఒక్కరికీ సురక్షిత వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీకి దూరం, మనసుకు దూరం అనే భావనను విడనాడాలని కోరారు. కాశ్మీర్‌లో ఎన్నికలు డీ లిమిటేషన్ తర్వాతనే జరుగుతున్నామని మోడీ సమావేశంలో తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
ప్రధానితో సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, జమ్ముకాశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న సానుకూల దృక్ఫథంతో తాము బయటకు వచ్చినట్లు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోన్ చెప్పారు. సమావేశం సందర్భంగా జమ్ముకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జమ్ముకాశ్మీర్ అప్నీ పార్టీ చీఫ్ మహ్మద్ బుఖారీ వెల్లడించారు.
 
ప్రధానితో సమావేశంలో మొత్తం 5 డిమాండ్లను తాము లేవనెత్తామని కాంగ్రెస్ నేత,కశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ తెలిపారు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడానికి ఇంతకన్నా మంచి సమయం లేదన్నారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ జమ్మూకశ్మీర్ కు పూర్తిస్థాయి రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం డిమాండ్ చేశారన్నారు. సమావేశంలో పాల్గొన్న చాలామంది ఆర్టికల్ 370 గురించి మాట్లాడారని.. అయితే ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. జమ్మూకశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మోదీ చెప్పారని ఆజాద్ చెప్పారు. 
 
రాష్ట్ర హోదా డిమాండ్‌తోపాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వెంటనే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని, కశ్మీరీ పండిట్లకు జమ్ముకశ్మీర్‌లో పునరావాసం, అన్ని పార్టీల నేతలను నిర్బంధం నుంచి విడుదల చేయాలని మోదీని అడిగినట్లు ఆజాద్ వెల్లడించారు. ఈ సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్​లోన్, గులాం నబీ ఆజాద్​, ఒమర్ అబ్దుల్లా,యూసుఫ్ తరిగామి సహా​ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.