లోక్‌సభ బరిలో ప్రియాంక గాంధీ - సూచనప్రాయంగా రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ అగ్ర మహిళ ప్రియాంక గాంధీకి పార్లమెంట్‌లో అవకాశం వస్తే సమర్థంగా బాధ్యతలు నిర్వహించగలరని ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు మరింత మెరుగైన బాధ్యతలు అప్పగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఆమె ఖచ్చితంగా లోక్‌సభకు వెళతారు. అందుకు తగిన అర్హతలు మొత్తం ఆమెకు ఉన్నాయి. ఆమె పార్లమెంట్‌లో ఉండటానికి పూర్తిగా అర్హురాలు. కాంగ్రెస్ పార్టీ అమెకు మరింత మెరుగైన బాధ్యతలు అప్పగిస్తుందని ఆశిస్తున్నా' అని వ్యాఖ్యానించారు.
వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో తనకు సంబంధాలున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో పేర్కొనడాన్ని తిప్పికొట్టారు. ఆమె అందుకు తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. 'మన ప్రధాన మంత్రి అతడితో కూర్చొని ఉన్న ఫొటో ఉంది. ఆ విషయాన్ని మేము ఎందుకు ప్రశ్నించకూడదు. రాహుల్ అదే కదా అడిగింది. వీటికి ఎందుకు సమాధానం చెప్పరు.
ఇక మహిళా రెజ్లర్లు హర్యానాలో ఆందోళన చేస్తే.. మహిళా మంత్రి స్మృతి ఇరానీ వారిని ఎందుకు కలవరు. వారి సమస్యలు ఎందుకు తెలుసుకోరు. మణిపూర్ తగలబడుతోంది.. ఈ మంత్రి మాత్రం నా గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నేను కనీసం పార్లమెంట్‌లో కూడా లేను కదా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారికి ఏ ఇబ్బందికర పరిస్థితి వచ్చినా.. నాపై ఏదో ఒక ప్రతికూల ప్రచారం చేస్తోంది. కానీ, ఏమీ నిరూపించలేకపోయారు' అని వాద్రా ఆరోపించారు.