డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే.. పారిశుధ్య కార్మికులకు రూ.కోటి పరిహారం... ఆప్ మేనిఫెస్టో విడుదల
ఢిల్లీ అసెంబ్లీ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్ అందిస్తామని భరోసా ఇచ్చింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది ఆప్. ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత యాత్రాసౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
యమునా నదిని శుభ్రం చేస్తామని, CCTV నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయడం, ఢిల్లీ మెట్రో విస్తరణ, యువతకు స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ, పారిశుద్ధ కార్మికుల సంక్షేమ చర్యలు వంటి పలు హామీలతో ఆప్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీలో చనిపోతే కోటి రూపాయల పరిహారం అందిస్తామని మేనిఫెస్టోలో ఆప్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దమ్ముంటే రేపు మధ్యాహ్నం ఒంటిగంటలోగా బీజేపీ తన సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ చేశారు.
ఎవరు సీఎం కావాలో ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ ప్రకటించే ముఖ్యమంత్రి అభ్యర్థితో తాను చర్చకు సిద్ధమన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన రిలీజ్ చేశారు.
2015లోనే లోక్ పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ పాస్ చేసినా… కేంద్రం పెండింగ్ లో పెట్టిందని ఆప్ ఆరోపించింది. కేంద్రం బిల్లు పాస్ చేసేవరకు పోరాటం చేస్తామన్నారు నేతలు.