శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (05:51 IST)

దేశమంతా గోవధ నిషేధమే.. కానీ గోరక్షకులు హింసకు పాల్పడవద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్

గోవధకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిషేధం విధించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పిలుపిచ్చారు. అదే సమయంలో గోరక్షకులు ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసకు పాల్పడవద్దని సూచించారు.

గోవధకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిషేధం విధించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పిలుపిచ్చారు. అదే సమయంలో గోరక్షకులు ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసకు పాల్పడవద్దని సూచించారు. గోవులను చంపడంపై నిషేధం విధించడం ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. దేశ వ్యాప్తంగా గోవధపై నిషేధం విధించాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై సమర్థవంతమైన చట్టాన్ని చేసే బాధ్యత ప్రభుత్వందే అని అన్నారు. అదే సమయంలో భారత్‌లోని వైవిధ్యం దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకురావడాన్ని కష్టసాధ్యం చేస్తోందని భాగవత్ అంగీకరించారు. ఆల్వార్‌లో గోరక్షకులు జరిపిన దాడిలో 55 ఏళ్ల ముస్లిం డైరీ రైతు పెహ్లు ఖాన్ చనిపోయిన నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్ గోవధ దేశవ్యాప్త నిషేధంపై ప్రకటన చేయడం గమనార్హం.
 
మహావీర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ గోవధపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. గోవధపై దేశం మొత్తం మీద ఒకే చట్టాన్ని చేయడం రాజకీయ సంక్లిష్టతల వల్ల కష్టసాధ్యంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న అంకిత భావం కలిగిన స్వయం సేవక్‌లు గోవధ చట్టాలను అమలు చేస్తున్నారని, స్థానిక సంక్లిష్టతలను అధిగమించి గో సంరక్షణపై కలిసి కట్టుగా పనిచేస్తామని ఆయన ఆత్మవిశ్వాసం ప్రకటించారు. 
 
అయితే గోవధ వ్యతిరేకత పేరుతో జరిపే ఎలాంటి హింస అయినా సరే గోవధ వ్యతిరేక ఉద్యమంపై తీవ్ర ప్రభావం కలిగిస్తుందని ఆరెస్సెస్ అధినేత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్వాల్ సంఘటన పేరెత్తకుండానే ఆయన ఈ వ్యాఖ్య చేశారు. హింసకు పాల్పడమని మిమ్మల్ని కోరే చట్టం ఏదీ దేశంలోలేదు. గోసంరక్షణలో భాగమైన వారు హింస జరపకుండా తమ ప్రయత్నాలను సాగించాలన్నారు. 
 
గోసంరక్షణ సందర్భంగా ఎలాంటి హింసకూ పాల్పడకండి. ఆవును రక్షించే సమయంలో ప్రజల మనోభావాలను గోరక్షకులు గాయపర్చవద్దు. అలా చేస్తే గోరక్షణ ఉద్దేశమే దెబ్బతింటుంది. రాజ్యాంగంలోని చట్టాలకు అనుగుణంగానే గోసంరక్షణ పని సాగాలి అని ఆరెస్సెస్ అధినేత హితవు చెప్పారు. అదేసమయంలో ప్రజల మనస్సుల్లో మార్పు రానిదే గోవధకు ముగింపు ఉండదు అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.