శశికళ ఎపుడు రిలీజ్ అవుతారంటే...?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బెంగుళూరు పరప్పణ అగ్రహార కేంద్రకారాగారం ఉన్నతాధికారి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
బహుశా వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన ఆమె రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. కోర్టు విధించిన జరిమానా ఆమె చెల్లిస్తే, తప్పకుండా ఆ తేదీన ఆమెను రిలీజ్ చేస్తామన్నారు. అయితే, కోర్టు విధించిన అపరాధం చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు జైలుశిక్షను పొడగించే సూచనలు ఉన్నట్టు తెలిపారు.
కాగా, 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేశారు. అయితే తమిళనాడులో వచ్చే యేడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె రిలీజ్ కానున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు కోర్టు వేసిన నాలుగేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టింది. కానీ ఆ పార్టీ నుంచి పళనిస్వామి బృందం ఆమెను తొలగించారు. అక్రమాస్తుల కేసులో ఇళవరసై, సుధాకరన్‌లు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఒకవేళ పేరోల్ సదుపాయాన్ని వినియోగిస్తే, శశికళ రిలీజ్ తేదీ మారే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్పారు.