1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (10:30 IST)

అమర్ నాథ్ జలప్రళయంలో 37మంది ఏపీ ప్రయాణీకుల గల్లంతు

floods
జమ్మూకాశ్మీర్ అమర్ నాథ్ జలప్రళయంలో ఏపీకి చెందిన 37 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించలేదు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితోపాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు సమీపంలోని ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమండ్రికిచెందిన ఇద్దరు మహిళల సహా 37 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
అమర్‌నాథ్‌ యాత్రలో వరదల తర్వాత పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు అందకపోవడంతో స్థానిక రెవెన్యూ అధికారులు వారి అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. 
 
ఈ క్రమంలో కొందరు.. తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని, ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆచూకీ లభించని వారి విషయంలో మాత్రం ఆందోళన నెలకొంది. వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.
 
అమర్‌నాథ్‌‌లో గల్లంతైన ఏపీ వాసుల సమాచారాన్ని.. ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్న ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్‌కు అందజేశారు. ఆయన అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఏపీ వాసుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం, ఫోన్ చార్జింగ్ అయిపోవడం వంటి కారణాల వల్ల సరైన సమాచారం అందడం లేదని, తద్వారా గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.