శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (11:34 IST)

కేవలం 4 గంటల్లో వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ

china army
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర సాగలేదు. ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో రెండేళ్ళ తర్వాత అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, అమర్నాథ్ భక్తులకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతికూల వాతావరణం అనుకూలించడం లేదు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారత సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోంది. 
 
తాజాగా, ఈ యాత్ర కొనసాగే మార్గంలో కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన బల్తాల్‌ వంతెనను కేవలం 4 గంటల్లోనే పునరుద్ధరించారు. ఇటీవలే యాత్ర మార్గంలోని బల్తాల్‌ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. 
 
వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్‌ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త వంతెనను అందుబాటులోకి తెచ్చారు.