గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:39 IST)

ఆస్తి కోసం సవతుల పోరు.. భర్త శవంతో జాగారం.. ఎక్కడ?

deadbody
తమిళనాడు రాష్ట్రంలోని కళ్ళకుర్చి జిల్లాలో ఆస్తి కోసం ఇద్దరు సవతుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చనిపోయిన తన భర్తను ఖననం చేసేందుకు ఓ భార్య అంగీకరించలేదు. దీంతో భర్త శవంతో ఇద్దరు సవతులు ఏకంగా నాలుగు రోజుల పాటు జాగారం చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కళ్లకుర్చి జిల్లా సెమ్మనంగూరై గ్రామానికి చెందిన రామస్వామి (65)కి లక్ష్మి, వాసుకి అనే ఇద్దరు భార్యలున్నారు. తొలి భార్యకు ఐదుగురు కుమార్తెలు, రెండో భార్య వాసుకికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రామస్వామి ఈ నెల 22 రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు.
 
అదేసమయంలో రామస్వామి మొదటి భార్య లక్ష్మికి రాసిచ్చిన 10 సెంట్ల స్థలంలో తనకు సమాన వాటా (ఐదు సెంట్ల భూమి) ఇవ్వాలని రెండో భార్య వాసుకి పట్టుబట్టింది. తనకు వాటా ఇవ్వకుంటే భర్త మృత దేహాన్ని కదలనివ్వనని మొండికేసింది. అయితే తన స్థలంలో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని మొదటి భార్య లక్ష్మి తేల్చిచెప్పింది. దీంతో వాసుకి భర్త అంత్యక్రియలను అడ్డుకుంది. 
 
రోజులు గడిచిపోతున్నప్పటికీ సవతుల మధ్య తగాదా తెగకపోవడంతో అంత్యక్రియలకు వచ్చినవారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. రామస్వామి మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం సెమ్మనంగూరైకు వచ్చి వాసుకిని హెచ్చరించడంతో ఆమె మెత్తబడింది. దాంతో కుటుంబీకులు రామస్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.