సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (15:08 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : సిసోడియాకు దక్కని ఊరట... బెయిల్‌కు సుప్రీం నో

Manish Sisodia
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.38 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. గత ఎనిమిది నెలలుగా జైల్లో మగ్గుతున్న మనీశ్ మరికొన్ని నెలలు జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీ వ్యాపారులకు అనుకూలంగా రూపకల్పన చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ పాలసీపై సర్వత్రా విస్మయం రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పాలసీని పక్కన పెట్టేసింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగింనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తుంది. 
 
గత ఫిబ్రవరి 26వ తేదీన సిసోడియాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తులు కింది కోర్టులు కొట్టేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది.