శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (14:47 IST)

తెరపైకి సుష్మా స్వరాజ్ పేరు : రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదన?

భారత రాష్ట్రపతి రేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెలలో జరుగనుంది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార భారతీయ జనతా పార్టీ నేతలు తమ వంతు ప్రయ

భారత రాష్ట్రపతి రేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెలలో జరుగనుంది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార భారతీయ జనతా పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందుకోసం బీజేపీ ఓ త్రిసభ్య కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు వెంకయ్య, రాజ్‌నాథ్ సింగ్,  అరుణ్ జైట్లీలు ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మహిళా మణుల పేర్లు తెరపైకి రాగా, ఇపుడు కొత్తగా సుష్మా స్వరాజ్ పేరు వచ్చింది. ఆ దిశగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. అటు ఆర్ఎస్ఎస్ కూడా ఆమోదయోగ్యమైన అభ్యర్థి సుష్మా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంకోవైపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కోసం కేంద్ర మంత్రులు వెంకయ్య, రాజ్‌నాథ్, జైట్లీలతో కూడిన త్రిసభ్య కమిటీ అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపేందుకు సిద్ధమవుతోంది. 
 
శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనూ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ కమిటీ చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో సుష్మాను తమ అభ్యర్థిగా ప్రకటిస్తే విపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది.
 
కాగా, 65 ఏళ్ల సుష్మ స్వరాజ్ చాలా మృదు స్వాభావిగా పేరుగడించారు. 7 సార్లు ఎంపీగానూ, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె జనతాపార్టీ రోజుల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. అంతేకాదు అపార అనుభవం ఆమె సొంతం. 25 ఏళ్ల వయసులోనే ఆమె హర్యానాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్‌తో ఆమెకు విడదీయలేని అనుబంధం ఉంది. అటు విదేశాంగమంత్రిగా మంచి పేరు సంపాదించారు. 
 
ముఖ్యంగా.. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న, చిక్కుల్లో ఉన్న భారతీయులను స్వదేశాలకు రప్పించడంలో ఈమె కీలకపాత్ర పోషించి ప్రశంసలు పొందారు. ఇతర రాజకీయ పక్షాలతోనూ సుష్మాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్, జేడీయూ లాంటి పార్టీలు ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు పలికే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరపున అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించుకుంది.