శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (12:45 IST)

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై చర్యలకు కేంద్రం ఆదేశం

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారు సూచన చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 
 
లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పకుండా పాటించేలా చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలిపింది. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిందని పేర్కొంది.
 
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ చాలా మంది రోడ్లపైకి వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. టీఎస్ ఆర్టీసీ బంద్ కావడంతో ప్రైవేటు వాహనాలు ధరలు పెంచేస్తున్నాయి. ప్రభుత్వం చేస్తోన్న హెచ్చరికలను చాలా మంది వాహనదారులు పట్టించుకోవట్లేదు. 
 
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. దీంతో టోల్ గేట్లను మూసేశారు. ఇళ్లలోంచి బయటకు వచ్చిన వారికి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపుతున్నారు.
 
రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో వాహనాలపై యథేచ్ఛగా తిరుగుతోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుతామని తెలిపారు. వారి వాహనాలు సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించామని చెప్పారు. మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు.