వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్
హీరో అల్లు అర్జున్ హీరోయిన్ నివేదా పేతురాజ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలుకానుంది. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్టు ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని వినాయక చవితి శుభదినాన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఒకటి ఇపుడు వైరల్ అయింది. పైగా, తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోను సైతం ఆమె వెల్లడించింది.
ఇంతకీ నివేదా పేతురాజ్ వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు రాజాత్ ఇబ్రాన్. ఆయన ఒక వ్యాపారవేత్త అని సమాచారం. రాజాత్ ఇబ్రాన్ దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనే ప్రచారం జరుగుతోంది. వీరి వివాహ వేడుక ఈ యేడాది చివరి నాటికి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేడుకను ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
నివేదా పెళ్లి వార్త తెలియగానే ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఆమె కాబోయే భర్త వివరాల కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు.
కాగా, తమిళ చిత్రం 'ఒరు నాల్ కూత్తు' అనే చిత్రంతో నటిగా అరంగేట్రం చేసిన నివేదా, 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'అల వైకుంఠపురములో', 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'దాస్ కా ధమ్కీ' వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.