గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (07:46 IST)

లాక్‌డౌన్ వల్ల ఉపయోగం లేదు.. డబ్ల్యూహెచ్ఓ : ఇటలీలో ఆగని మరణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు అనేక ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ లాక్ డౌన్‌ను కూడా భారత ప్రభుత్వం కూడా అమలు చేసింది. పైగా, దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన 75 జిల్లాల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగించింది. అయితే, ఇలాంటి లాక్‌డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్యం సంస్థకు చెందిన హైరిస్క్ నిపుణుడు మైక్ ర్యాన్ అభిప్రాయపడుతున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించాలంటే మొదట వైరస్ సోకిన వారిని, అనారోగ్యంపాలైన వారిని గుర్తించాలని సూచించారు. ఆపై వారందరినీ ఐసోలేషన్‌కు తరలించి, వారు కలిసిన వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచాలని వివరించారు. అంతేతప్ప, వైరస్ సోకిన వారిని గుర్తించకుండా లాక్‌డౌన్ ప్రకటిస్తే ఫలితం ఉండదని స్పష్టంచేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 
 
మరోవైపు, ఈ కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ మరణాలు ప్రపంచ వ్యాప్తంగా 13వేలకు చేరింది. ముఖ్యంగా ఇటలీలో మాత్రం ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,500కు పెరిగింది.
 
అలాగే, ఫ్రాన్స్‌లో 562 మంది మరణించగా, పారిస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. బ్రిటన్‌లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. స్పెయిన్‌లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకుని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1720కి చేరింది.
 
అమెరికాలో లక్షలాదిమంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా వైరస్ సోకింది. అమెరికాలో ఒక్క రోజులోనే కొత్తగా ఏడువేల కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 26,574కు చేరింది. 
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని చైనాలో ఆదివారం తొలి కేసు నమోదైంది. కొత్తగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3261కి చేరుకుంది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించిన 340 మందిని అరెస్టు చేశారు.