ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (10:09 IST)

జిల్లా స్థాయి మహిళలతో అసభ్య సంబాషణలు : బీజేపీ నేత రిజైన్

తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ తన పదవిని కోల్పోయారు. ఆయన ఓ జిల్లాస్థాయి నాయకురాలితో అశ్లీల సంభాషణలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 
 
ముఖ్యంగా, కేటీ రాఘవన్ వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేసింది కూడా ఇటీవలే బీజేపీలో చేరిన మదన్‌ రవిచంద్రన్‌ అనే పాత్రికేయుడే కావడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అనుమతి తీసుకునే ఈ వీడియోను విడుదల చేసినట్టు ఆయన చెప్పడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం. ఈ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోపే కేటీ రాఘవన్‌ పార్టీ పదవికి రాజీనామా చేశారు. 
 
ఈ సందర్భంగా రాఘవన్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశం పోస్టు చేశారు. తాను మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పార్టీకి సేవ చేశానని, తానెలాంటి వాడినో రాష్ట్ర ప్రజలకు, తన సన్నిహితులందరికీ బాగా తెలుసని అందులో పేర్కొన్నారు. 
 
సామాజిక ప్రసార మాధ్యమాల్లో తనకు సంబంధించిన ఓ వీడియో మంగళవారం ఉదయం విడుదలైనట్టు తెలుసుకున్నానని, తనను తన పార్టీని కళంక పరిచేలా ఆ వీడియో విడుదలైందని చెప్పారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని కలిసి పార్టీ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు.