మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (08:06 IST)

రాజీవ్ ముద్దాయికి జైలు నుంచి తాత్కాలిక విముక్తి!

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన ఏజీ పేరరివాలన్‌ను తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించింది. ఆయన్ను నెల రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
ప్రస్తుతం ఆయన చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో రెండు నెలలపాటు తన కుమారుడికి పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తల్లి అర్బుదమ్మాళ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు వినతిపత్రం పంపారు. 
 
దీన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి పేరరివాలన్‌కు 30 రోజులపాటు షరతులు లేని సాధారణ పెరోల్ మంజూరు చేయాలని బుధవారం జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో ఆయన గురువారం జైలు నుంచి విడుదల కానున్నారు. 30 రోజుల పాటు ఆయన ఎలాంటి షరతులు లేకుండా బయటవుంటారు. 
 
ఇదిలావుంటే, రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్లో పేరరివాలన్ ఒకడు. 21 మే 1991న శ్రీపెరుంబదూర్ సమీపంలో మహిళా సూసైడ్ బాంబర్ థాను చేతిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. కాగా, గతేడాది మద్రాస్ హైకోర్టు పేరరివాలన్‌కు మెడికల్ చెకప్‌ కోసం 30 రోజుల పెరోల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దానిని మరో వారం రోజులపాటు పొడిగించిన విషయంతెల్సిందే.