శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (11:45 IST)

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేకు జైలుశిక్ష

తమిళనాడు రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఆ నేత పేరు పరమశివం. విళుపురం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 33 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 
 
1991లో విళుపురం జిల్లా చిన్నసేలం నుంచి పోటీ చేసిన పరమశివం ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అక్రమాస్తుల కేసులో దివంగత జయలలిత, శశికళ తదితరులపై దాఖలైన కేసుల్లో పరమశివం కూడా ఉన్నారు. 1991-96 మధ్య ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు 1998లో ఏసీబీ కేసు నమోదు చేసింది.
 
తొలుత ఈ కేసును విళుపురం కోర్టులో విచారించగా, ఆ తర్వాత చెన్నైలోని ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టుకు మారింది. అక్కడ కొన్నాళ్లపాటు విచారణ జరిగిన తర్వాత మళ్లీ విల్లుపురం జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేశారు.
 
తాజాగా జరిగిన విచారణలో పరమశివం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు నిర్ధారణ అయింది. దీంతో నిన్న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయన సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.