తమిళనాడులో జూన్ 7 వరకు లాక్ డౌన్... సీఎం స్టాలిన్ ప్రకటన
తమిళనాడులో జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ముగుస్తుండగా.. కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుండగా.. నిత్యావసర సరుకులు, కూరగాయలను ప్రభుత్వ శాఖల ద్వారా మాత్రమే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ డెలివరీ కొనసాగుతోంది.
స్థానిక సంస్థల అనుమతితో ఆయా ప్రాంతాల్లో వాహనాల ద్వారా అవసరమైన సామాగ్రిని విక్రయించడానికి ప్రొవిజన్ స్టోర్లను అనుమతిస్తామని స్టాలిన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 13 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్‌ను అందచేస్తామన్నారు. లాక్‌డౌన్ లో కోవిడ్-19 కేసులు తగ్గిన పూర్తి సంతృప్తికరమైన ఫలితాలు రాలేదని స్టాలిన్ చెప్పారు.
ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ కు ఎలాంటి సడలింపులుండవని ప్రభుత్వం తెలిపింది. జూన్ ఏడు వరకూ ఇవే నిబంధనలు కొనసాగుతాయని సిఎం స్టాలిన్ వెల్లడించారు. అటు తమిళనాడులో తాజాగా 33,361 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 474 మంది మరణించారు.