ఆలస్యంగా నడిచిన రైలు... రూ.1.36 లక్షల పరిహారం చెల్లింపు
ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇపుడు చలికాలం కావడంతో విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో అనేక రైళ్లు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం అలీగఢ్ - ఘజియాబాద్ మధ్య దట్టమైన పొంగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఈ ఆలస్యానికి కారణమైంది. ఈ రైలు షెడ్యూల్ ప్రకారం లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకోవాల్సివుంది.
కానీ, మధ్యాహ్నం 2.19 గంటలకు చేరుకుమంది. ఈ రైలులో మొత్తం 544 మంది ప్రయాణికులు ఉండగా, ఐఆర్‌సీటీసీ నిబంంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ రూ.250 చొప్పున మొత్తం రూ.1.36 లక్షల పరిహారాన్ని చెల్లించింది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు గంట ఆలస్యంగా బయలుదేరింది.