శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (11:47 IST)

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల తరుణంలో శ్రీనగర్‌లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడి

74వ స్వాతంత్ర్య సంబరాలు రేపు జరుగనున్న తరుణంలో శ్రీనగర్ శివార్లలో ఈ రోజు ఉదయం ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పోలీసు బృందం వెళుతున్న కాన్వాయ్ పైన దాడి చేశారు. నౌగామ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో జమ్ము అండ్ కాశ్మీరుకు చెందిన ఇద్దరు పోలీసులు మరణించారని, తీవ్ర గాయాలపాలైన మరొకరికి చికిత్స జరుగుతోందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
 
బైపాస్ రహదారిలో కాన్వాయ్ వెళుతుండగా ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులకు దిగారని, గాయపడిన ముగ్గురుని ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు చికిత్స పొందుతూ అమరులయ్యారని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలు చుట్టిముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ప్రారంభించారని తెలిపారు.
 
కాగా మరికొన్ని గంటల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నిత్యం హైఅలర్ట్‌లో ఉండే ప్రాంతంలో ఇటువంటి దాడులు జరగడం గమనార్హం అని నిఘా వర్గాలు తెలిపాయి.