సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదు.. చంపేశారు : ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్‌తో కలిసి ఉంటూ వచ్చిన పితాని సిద్ధార్థ్ ఇపుడు ముంబై పోలీసులకు ఓ లేఖ రాశారు. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ సుశాంత్ ఫ్యామీ మెంబర్స్ ఒత్తిడి తెస్తున్నారంటూ అందులో పేర్కోవడం సంచలనంగా మారింది. మరోవైపు, సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ ఇపుడు మరో బాంబు పేల్చింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారంటూ ఆరోపించింది. ఈ విషయాన్ని తాము మొదటిరోజు నుంచి చెబుతున్నామని తెలిపారు. సుశాంత్ కుటుంబ సభ్యులదీ ఇదే అభిప్రాయమన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ఉపయోగించినట్టు చెబుతున్న వస్త్రానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పటికీ బయటికి రాలేదని అన్నారు.
 
ఈ ఘటన జరిగిన జూన్ 14న పితానీ, శామ్యూల్ అనే ఇద్దరు వ్యక్తులే అక్కడ ఉన్నారని, వీరిద్దరూ సుశాంత్ సాంకేతిక వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారని పారిఖ్ వెల్లడించారు. అయితే, సుశాంత్ సోదరి అక్కడికి వచ్చే వరకు ఆగకుండా పితానీ, శామ్యూల్ ఎందుకు హడావుడి ప్రదర్శించారని ప్రశ్నించారు. 
 
సుశాంత్ సీలింగ్‌కు వేళ్లాడుతుండగా చూసింది పితానీ, శామ్యూల్ మాత్రమేనని తెలిపారు. సుశాంత్ ముఖంపై గాయాలు కనిపించాయని, తమకు తెలిసినంతవరకు సుశాంత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకోనేంత పిరికివాడు కాదని స్మితా పారిఖ్ స్పష్టంచేశారు.
 
"మాజీ మేనేజర్ దిశా సలియా చనిపోయినప్పటి నుంచి సుశాంత్ ఎంతో కలవరపాటుకు గురయ్యాడు. సుశాంత్ ఎందుకు కలత చెందాడో మాకు తెలుసని భావిస్తున్నాం. సుశాంత్ ఎవరి పేర్లు బయటపెట్టకపోయినా, ఎందుకోగానీ దేని గురించో బాగా భయపడ్డాడు. ఆ వ్యక్తులు సుశాంత్ పాత బాడీగార్డులను, వంటవాళ్లను తప్పించేశారు. 
 
పితానీ, శామ్యూల్‌లను మాత్రం సుశాంత్‌తో ఉంచారు. గతేడాది సుశాంత్ బ్యాంకు ఖాతాలో రూ.40 కోట్లు ఉన్నాయి. రియా మేకప్ కోసం, ఇతర ఖర్చుల కోసమే కోట్లు ఖర్చు చేసినట్టు బ్యాంకు రసీదులు చెబుతున్నాయి. సుశాంత్ చనిపోయింది ఆత్మహత్యతో కాదని మేం 100 శాతం ఖచ్చితంగా చెప్పగలం" అంటూ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.