గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:47 IST)

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 26,291 కొత్త కేసులు బయటపడ్డాయి.

ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసులివే. అంతక్రితం రోజుతో పోలిస్తే 3.8శాతం కేసులు పెరగడం గమనార్హం. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,13,85,339కి చేరింది. ఇక ఇదే సమయంలో 17,455 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,10,07,352 మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 96.68శాతంగా ఉంది.
 
2శాతానికి చేరువలో యాక్టివ్‌ కేసులు
కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు కూడా మళ్లీ 2లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,19,262 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 1.93శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మరో 118 మంది వైరస్‌కు బలయ్యారు.

దీంతో ఇప్పటి వరకు 1,58,725 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. గత కొద్దిరోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఈ కేసుల సంఖ్య ఏకంగా 16వేలు దాటింది.

నిన్న అక్కడ 16,620 మంది వైరస్‌ బారిన పడగా.. 50 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.19లక్షల యాక్టివ్‌ కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 1,26,231 క్రియాశీల కేసులుండటం గమనార్హం. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంది. నాగ్‌పూర్‌ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది..