శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:49 IST)

ఏపీలో 'కరోనా'కు ఏడాది

ఏపీలో కరోనా తొలి కేసు నమోదై ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది క్రితం 2020 మార్చి 12న నెల్లూరు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఫ్రాన్స్‌ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఆ తరువాత నుంచి రాష్ట్రంలో కేసుల నమోదు క్రమక్రమంగా పెరిగాయి. మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. అయినా కరోనా ఉధృతి మాత్రం తగ్గలేదు. లాక్‌డౌన్‌ సమయంలోనే రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఆగస్టు-సెప్టెంబరు మధ్య కాలంలో కేసుల ఉధృతి మరింత ఎక్కువైంది.

ఆగస్టులో 22,39,550 మంది ఈ వ్యాధి బారిన పడగా, వీరిలో 2,646 మంది మరణించారు. ఇదే నెలలో అత్యధికంగా 16.66 శాతం పాజిటివిటీ నమోదైంది. ఈ నెలలోనే ఒకేరోజు 10 వేల కేసులు రావడంతో పాటు 97 మంది కరోనాతో మరణించారు. ఆగస్టు 22న కరోనాతో అత్యధికంగా 97 మంది మరణించగా, 26వ తేదీన అత్యధికంగా 10,830 కేసులు నమోదయ్యాయి.

నవంబరు వరకు వ్యాధి విస్తరణ ఉధృతంగా కొనసాగింది. రాష్ట్రంలో రికవరీ శాతం 99.06 శాతంగా, మరణాల శాతం 0.81గా ఉంది. కేసుల నమోదు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా (1,24,583)లో ఉంది. చిత్తూరు జిల్లాలో ఈ వ్యాధితో అత్యధికంగా 856 మంది మరణించారు. డిసెంబరు నుంచి కేసుల నమోదు రాష్ట్రవ్యాప్తంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.

అప్పటి వరకు వేలలో నమోదైన కేసులు వందల్లోకి వచ్చాయి. జనవరి పదో తేదీ నుంచి 200లోపు మాత్రమే నమోదయ్యాయి. అయితే రెండు వారాల నుంచి మరలా కొత్త కేసుల నమోదు పెరుగుతోంది. సుమారు రెండు నెలల తరువాత కేసుల సంఖ్య 200 సంఖ్య దాటింది.

గతేడాది తొలికేసు నమోదైన సమయంలోనే కరోనా కేసుల సంఖ్య పెరగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,709 మంది శ్యాంపిల్స్‌ను పరీక్షించగా 210 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,91,388 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,82,981 పూర్తిగా కోలుకున్నారు. 7,180 మంది ఈ వ్యాధి వల్ల మరణించారు.

ఏడాదిలో 1,44,48,650 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,227 మంది కరోనాతో బాధపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 431 మంది చికిత్స తీసుకుంటున్నారు.