''వ్యభిచారిణి'' అంటే భార్య ఎలా ఓర్చుకుంటుంది.. సుప్రీం కోర్టు
దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ''వ్యభిచారి'' అంటూ దూషించిన భర్తను ఆవేశంలో భార్య కొట్టి చంపేసింది. దీన్ని హత్యగా పరిగణించలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది. భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పిన భర్త.. తన భార్యాకూతుళ్లను వ్యభిచారిణులు అని దూషించాడు. దీంతో భార్య ఆవేశానికి గురైంది. అంతేగాకుండా భర్తపై భార్య ఆవేశంతో దాడి చేసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన భర్త మరణించాడు. ఈ కేసులో శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ అప్పీలు చేయడం జరిగింది. ఈ కేసుపై విచారణకు అనంతరం తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు.. కట్టుకున్న భర్తే.. తనను, తన కుమార్తెలను వ్యభిచారులని దూషించడాన్ని ఏ భారతీయ మహిళ ఓర్చుకోలేదని సుప్రీం తెలిపింది.
అంతేగాకుండా తనతో పాటు తన కుమార్తెలను కూడా భర్త ఆ పదంతో దూషించడాన్ని ఓర్చుకోవడం కష్టమని.. అలాంటి పదాలను ఉపయోగించడమే సదరు మహిళ ఆవేశానికి కారణమైందని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఆవేశానికి గురిచేసే లాంటి వ్యాఖ్యలు చేయడంతోనే సదరు మహిళ దాడికి దిగిందని.. దీన్ని హత్యగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇంకా ఈ కేసులో సదరు మహిళకు శిక్షా కాలాన్ని పదేళ్లు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.