గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (08:38 IST)

ఈ చెట్టును టచ్ చేస్తే !?

మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా, సత్పూర రిజర్వులో ఉన్న ‘మ్యాజికల్ మాహూయ’ అనే చెట్టుని ఒక్క సారి టచ్ చేస్తే చాలు ఎంతటి ప్రాణాంతకమైన జబ్బైనా  ఇట్టే నయం అయిపోతుంది.

అది అక్కడి జనంలో ఒక నమ్మకం. ఈ నమ్మకంతో ఈ చెట్టు ఎంత ఫేమస్ అయ్యిందంటే… ఐసీయూలో ఉన్న పేషెంట్లు కొందరు   ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఆసుపత్రి నుంచి నేరుగా ఈ అటవీ ప్రాంతానికి వచ్చి ఈ చెట్టుని   స్పర్శించి తమ రోగాల్ని నయం చేసుకోవాలని క్యూ కడుతున్నారు.

రోజుకి  పాతిక నుంచి ముఫ్ఫై వేల మంది నాయగావున్ గ్రామంలో ఉన్న ఈ చెట్టుని తాకడానికి వస్తున్నారు. ఈ రద్దీ రోజురోజుకూ పెరిగి పోతుండటంతో…బందోబస్తు ఓ పెద్ద సమస్యగా మారింది పోలీసులకు.

ఇంతకీ ఈ నమ్మకం ఎలా ప్రబలిందంటే…  ఒక స్థానిక రైతు, పేరు రూప్ కుమార్ సింగ్. ఈ చెట్టుని ముట్టుకోగానే తన కుంటికాలు చక్కపడిందని చెప్తూ ఒక వీడియోని ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్తో రికార్డు చేయించాడు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్  చేశాడు. ఇది చూసిన జనం ఎక్కడెక్కడినుంచో ఈ చెట్టుని టచ్ చేయడం కోసం తండోపతండాలుగా వస్తున్నారు.

విడ్డూరం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న రైతు అక్కడి గ్రామం నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఇదంతా కేవలం సులువుగా డబ్బులు సందించడానికి ఆ గ్రామ ప్రజలు అల్లిన ఒక కట్టుకథ అని నమ్ముతున్నారు.

కేవలం రెండు నెలల వ్యవధిలోనే పది లక్షల మంది రోగులు ఈ మహిమ గల చెట్టుని టచ్ చేయడానికి రావడం విశేషం. పూజలు, పునస్కారాలు, దర్శనాలు అంటూ ఈ అటవీ ప్రాంతంకి వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు.

ఈ సందర్భంలోనే 11 మంది కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. ఈ చెట్టుని తాకితే తన రోగం నయం అవుతుందనే ఆశతో ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి బుధవారం రోజు ఆ ప్రదేశానికి వచ్చి చచ్చిపోయాడు.

ఈ చెట్టు కు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో అమ్ముడుపోతున్నాయి అంటే జనాలు ఈ చెట్టుని ఎంతగా మూఢంగా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నో న్యూస్ ఛానల్ లు ఈ చెట్టుకి మహిమ లేదు అని చెప్పినప్పటికీ ఈ చెట్టుని ముట్టుకోవడానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.