తమిళనాట తొలిసారి రైల్వే టీసీగా హిజ్రా!!
తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి ఓ హిజ్రా రైల్వేలో టిక్కెట్ ఇన్‌స్పెక్టరుగా నియమితులయ్యారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈ హిజ్రా పేరు సింధు. రాష్ట్రంలోనే తొలిసారి రైల్వే టీసీగా నియమితులయ్యారు. తమిళ సాహిత్యంలో బిఏ పూర్తి చేసిన (బీఏ లిటరేచర్) సింధు.. 19 ఏళ్ల క్రితం రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పనిచేశారు. అనంతరం బదిలీపై దిండుక్కల్‌కు వచ్చారు. ఓ ప్రమాదంలో ఆమె చెయ్యికి తీవ్రగాయమైంది. దీంతో వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఆమె టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తిచేశారు.
ఈ నేపథ్యంలో సింధు దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమెకు రైల్వేస్టేషన్ మేనేజర్ గోవిందరాజ్, సెక్రటరీ రబీక్ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.