మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (07:35 IST)

తెలంగాణ సీఎంవో ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పాలనపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా తన కార్యాలయంలో కీలక పోస్టులకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా, సీఎంవో ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ వి.శేషాద్రిని నియమించారు. ఈయన ఇప్పటివరకు సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) కార్యదర్శి, సీఎంవో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 
 
శేషాద్రికి రెవెన్యూ చట్టాలు, భూ వ్యవహారాల్లో అపారమైన పరిజ్ఞానం, అవగాహన ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని భూములు, రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు ఆయనకు కొట్టినపిండి. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌లో ఆయన కీలక భాగస్వామి. అప్పట్లో కేంద్ర సర్వీసుల్లో ఉన్న శేషాద్రిని కేసీఆర్‌ రాష్ట్రానికి పిలిపించుకున్నారు. గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన ఏనాడూ అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేదు. పైగా ముక్కుసూటి మనషి అనే పేరుందని అధికారులు చెబుతుంటారు. అందుకే శేషాద్రికి కీలక బాధ్యతలను అప్పగించడాన్ని బట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు. 
 
మరోవైపు, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా అదనపు డీజీ శివధర్‌రెడ్డిని నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు చెందిన శివధర్‌ రెడ్డి కూడా నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, యాంటీ నక్సల్స్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ - ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ వంటి విభాగాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఆయన ఐజీ ర్యాంకులో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రెండేళ్లపాటు సేవలందించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో దక్షిణ మండలం డీసీపీగా ఆయన పనిచేసిన సమయంలో మతకల్లోలాలను సమర్థంగా నియంత్రించారు. ఈ కారణాలతో శివధర్‌రెడ్డికి కీలక పదవిని ఇచ్చినట్లు తెలుస్తోంది.