శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (15:45 IST)

అవును.. రాహుల్ గాంధీ ఓ బఫూన్ : ఎంపీ కవిత

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ ఎంపీ కె. కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ బఫూన్ అంటూ విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నారో దేశ ప్రజలంతా చూశారని గుర్తుచేశారు. అందుకే సిల్లీగా ప్రవర్తించే వారిని బఫూన్ అనే అంటారన్నారు. 
 
ఆమె బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తృతీయ కూటమి (ఫెడరల్ ఫ్రంట్‌)ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. మా ఎజెండా ప్రజల కోసం పనిచేయడమే రాజకీయ పార్టీల కోసం కాదు. దేశంలో అనేక రాజకీయ కూటములున్నాయి.. కొన్ని విజయం సాధించాయ‌ని వ్యాఖ్యానించారు.
 
అయితే, కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉందన్నారు. ఈ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తటస్థ కూటమి ఏర్పాటు కావాల్సిన సమయం వచ్చిందన్నారు. 
 
రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ కూటమిలో టీఆర్‌ఎస్ లేదనీ, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్థానిక పార్టీల జాబితాలో మేమున్నాం. ఒక అభ్యర్థి ప్రధాని కావడం, ఒక పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు. తమ నేత కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ రాజకీయ పార్టీల కోసం కాదనీ దేశం కోసమన్నారు.