మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (11:09 IST)

#RKNagarElectionResult : దినకరన్ వర్గీయులు సంబరాలు...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో శశకళ వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ అందరికంటే ముందంజలో ఉన్నారు. దీంతో ఆయన వర్గీయులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. 
 
ముఖ్యంగా, బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పైగా, ఆయన గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం ఘంటాపథంగా చెపుతుండటంతో ఈ ఉప ఎన్నిక తుది ఫలితం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
కాగా, ఓట్ల లెక్కింపు మొత్తం 19 రౌండ్లలో కొనసాగనుంది. తొలి మూడు రౌండ్లలోనూ శశకళ వర్గానిదే పైచేయిగా ఉంది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రస్తుతం 15,868 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 
 
అన్నాడిఎంకే నుంచి పోటీచేసిన మధుసూదన్‌ 7,033 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదు గణేశ్ 3,780 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నాగరాజన్ 117 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దినకరన్‌తో పాటు అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ అభ్యర్థులతో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.