సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే ఎవరి బలమెంతో తేలిపోతుంది : శరద్ పవార్

sharad pawar
మహారాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార శివసేన పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వైపు ఉన్నారు.. పైగా అసలైన శివసేన పార్టీ తమదేనని వారు ప్రకటించారు. పైగా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మెజార్టీని కోల్పోయిందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
అసెంబ్లీ బలపరీక్ష నిర్వహిస్తే ఎవరి బలమెంతో తేలిపోతుందన్నారు. ఈ పరీక్ష ద్వారానే రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ భవితవ్యం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి బలమేంటో అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో రుజువవుతుందన్నారు. ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంలో భాజపా పాత్ర ఉందన్నారు.
 
'మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వ భవితవ్యం రెబల్‌ ఎమ్మెల్యేలు శిబిరం ఏర్పాటుచేసిన గౌహతిలో కాదు.. అసెంబ్లీలోనే తేలుతుంది. ప్రభుత్వం అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది' అని పవార్ అన్నారు. శివసేనలో తిరుగుబాటు వెనుక భాజపా పాత్ర లేదంటూ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడంలేదన్నారు. 
 
మహారాష్ట్ర వెలుపలి నుంచి వచ్చిన భాజపా నేతల గురించి అజిత్‌ పవార్‌కు తెలియనందున ఆయన అలా మాట్లాడి ఉండొచ్చని, కానీ వాళ్ల గురించి తనకు తెలుసన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు సారథ్యం వహిస్తున్న ఏక్‌నాథ్‌ శిందే కూడా ఒక ప్రముఖ జాతీయ పార్టీ తమకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పవార్‌ ఉటంకించారు.
 
పైగా తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలంతా ముంబైకి తిరిగి వచ్చి అసెంబ్లీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో గుజరాత్‌, అస్సాంకు చెందిన భాజపా నేతలు మార్గనిర్దేశం చేసేందుకు ఇక్కడ ఉండరన్నారు. అలాగే, తమ నియోజకవర్గాలకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసుకొనేందుకు కూడా తాము ఇబ్బంది పడుతున్నామంటూ కొందరు రెబల్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల్ని పవార్‌ తోసిపుచ్చారు. అవన్నీ కుంటిసాకులేనని.. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కేంద్ర సంస్థల విచారణ ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.