బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (14:46 IST)

పెళ్లి బంధాన్ని తలపాగా తీసేసినంత ఈజీగా తెంచుకోవద్దు : మద్రాస్ హైకోర్టు

పెళ్లి బంధంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి బంధాన్ని తలపాగా తీసేసినంత సులభంగా తెంచుకోరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, మహిళలకు ఉన్నట్టుగా భర్తలకు కూడా గృహహింస చట్టం లేకుండాపోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన రిట్ పిటిషన్‍‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
2015లో శశికుమార్‌పై అతడి భార్య సేలంలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు మహిళా కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందని ఫస్ట్ అడిషనల్ సబ్ జడ్జికి శశికుమార్ ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో విడాకులు రావడానికి నాలుగు రోజుల ముందు యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టరుకు కూడా భార్య ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన శశికుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ 2020 ఫిబ్రవరి 28న ఉత్తర్వులిచ్చారు. ఆ మర్నాడే దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
 
అయితే, తన వున్న ఉద్యోగ సస్పెన్షన్ ఆర్డరును తొలగించాలని కోరుతూ గత ఏడాది శశికుమార్ హైకోర్టు కెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు గృహ హింస చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి మహిళలలాగా భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పిటిషనర్‌ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందన్నారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందన్నారు. భార్యాభర్తలు తమ అహాన్ని పాదరక్షల్లా చూడాలని, ఇంటి బయటే దానిని వదిలేసి రావాలని సూచించారు. లేదంటే దాని ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందన్నారు.
 
ఓ వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యమని అన్న జస్టిస్ వైద్యనాథన్... తలపాగాను తీసేసినంత ఈజీగా బంధాన్ని తెంచుకోవద్దన్నారు. అయితే, సహ జీవనానికి హక్కు కల్పించిన గృహ హింస చట్టం 2005 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ‘పవిత్రత’ అన్న పదానికి అర్థం లేకుండాపోయిందని అన్నారు. శశికుమార్‌ను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ను జస్టిస్ వైద్యనాథన్ ఆదేశించారు.