బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (18:59 IST)

ఇప్పట్లో స్కూల్స్ తెరిచే అవకాశం లేదు : నిర్ణయానికి వచ్చిన కేంద్రం హోంశాఖ?

కరోనా లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తోంది. ఇందుకోసం అన్‌లాక్ పేరుతో వివిధ సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో అనేక సడలింపులు ఇచ్చింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి మరికొన్ని సడలింపులు ఇవ్వనుంది. ఇందుకోసం అన్‌లాక్ 4 ప్రక్రియ షురూ కానుంది. ఈ తాజా అన్‌లాక్ తీరుతెన్నులపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే ఆంక్షల సడలింపులో స్కూళ్లు ఉండవని ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.
 
అయితే, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతుండగా, అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, స్కూళ్లు, సినిమా థియేటర్లు, బార్లు తెరుచుకునేందుకు మరికొంతకాలం వేచిచూడకతప్పదు. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్రం ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశాలున్నాయి.
 
అలాగే, అన్‌లాక్ 4లో మరిన్ని సడలింపులను కేంద్రం ఇవ్వునుందని, అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల ఆధారంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని అంటున్నారు. ఇంతవరకూ, లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లు, సింగిల్ థియేటర్ సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్ వంటివి అనుమతించాలంటూ కేంద్రానికి పలు సలహాలు, సూచనలు అందాయి. అయితే, వీటిని అనుమతించే విషయంలో ఇంకా కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
 
లోకల్ రైళ్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుమతించాలనే యోచనలో కేంద్రం ఉంది. సింగిల్ స్క్రీన్ హాళ్లను సామాజిక నిబంధనలతో అనుమతించేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే ఆడిటోరియం, హాల్స్ విషంయంలోనూ థర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెక్, సామర్థ్యం కంటే తక్కువ మందిని అనుమతించడం వంటి సామాజిక దూరం నిబంధనలు తప్పనిసరి చేయనుంది. 
 
కేంద్ర మంత్రులు, సంబధిత శాఖలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంచుకునే సమాచారాన్ని బట్టి ఏ మేరకు కార్యకలాపాలను విస్తరించాలనే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కుంటుపడిన ఆర్థిక కార్యకలాపాలకు పునరుజ్జీవనం కల్పించే చర్యల్లోభాగంగా వీటికి అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.