అన్‌లాక్ 5.O నిబంధనలు పొడగింపు... ఎప్పటివరకు?
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్ 5.O నిబంధనలను నవంబరు 30వ తేదీ వరకు పొడగించింది. అంటే, సెప్టెంబరు 30న జారీ చేసిన మార్గదర్శకాలే నవంబరు 30 వరకు అమల్లో వుంటాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం హోం శాఖ మంగళవారం ఓ ప్రకటన చేసింది.
అయితే, ప్రజల ప్రయాణాలపైనా, సరుకు రవాణాపైనా ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపింది. ప్రజలు రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు ప్రయాణించేందుకు, అదేవిధంగా సరుకులను రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు ప్రత్యేకంగా అనుమతులు, ఈ-పర్మిట్లు పొందవలసిన అవసరం లేదని వివరించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో నవంబరు 30 వరకు అష్టదిగ్బంధనం అమలు కొనసాగుతుందని తేల్చిచెప్పింది.
కాగా, సెప్టెంబరు 30వ తేదీన ఎంహెచ్ఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో తెరిచేందుకు అనుమతి లభించింది. పాఠశాలలు, విద్యా సంస్థలను దశలవారీగా తెరవడంపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కొన్ని షరతులకు లోబడి 100 మందికి పైగా సాంఘిక, మతపరమైన, రాజకీయ సభల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను కొనసాగించింది.
అదేసమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని చెప్పింది. ఆ రాకపోకలకు ఎటువంటి అనుమతి అక్కర్లేదని పేర్కొంది. కాగా, దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం మార్చి 25 నుంచి మే 31 వరకు అమలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ నుంచి దశలవారీగా అన్‌లాక్ మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నాయి.