ఉన్నావో హత్యా కేసు: ఏడుగురు పోలీసులపై వేటు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావోలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు పోలీసులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం వేటేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉన్నావో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ త్రిపాఠితోపాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ వీర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేష్ మెష్రం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.
తనపై జరిగిన అత్యాచార కేసులో రాయబరేలీ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావో అత్యాచార బాధితురాలిని అడ్డుకుని నిందితులు దాడిచేశారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి బాధితురాలు చనిపోయిన విషయం తెల్సిందే.