యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కదిలే బస్సులో మహిళపై అత్యాచారం..
నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అనగానే ఈ ఘటనే గుర్తుకు వస్తుంది. ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా యూపీలో ఢిల్లీ తరహా ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రతాప్ గడ్ నుంచి నోయిడాకు 25 ఏళ్ల మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది.
కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతాప్ గడ్‌లో బస్సు ఎక్కిన సమయంలో బస్సు డ్రైవర్లు ఆమెకు వెనుక సీటు కేటాయించారు. బస్సు ఎక్కే సమయంలోనే ఇద్దరు డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. లక్నో, మధుర మధ్య ప్రాంతంలో బస్సులోని ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని.. నోయిడాలో దిగిన ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరికోసం గాలిస్తున్నారు.