శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (09:00 IST)

నువ్వు నా ప్రేయసిగా మారితే... పరీక్షల్లో పాస్ చేస్తా...

woman victim
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరు జిల్లాలో ఓ యువతికి విచిత్రమైన ప్రతిపాదన వచ్చింది. దీన్ని వినగానే ఆమె ఒకింత షాక్‌కుగురైంది. నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారితే పరీక్షల్లో పాస్ చేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి ఓయువతిని ప్రలోభ పెట్టాడు. పైగా, రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనికి ఆ యువతి నో చెప్పింది. ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ యువతికి తరచుగా ఫోన్లు చేస్తూ వేధించసాగాడు. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ, మెసేజ్‍‌లు పంపుతూ వేధించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ బాధిత యువతి మహరాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ కాన్పూర్‌లోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తుంది. ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో గణిత సబ్జెక్టులో ఫెయిల్ అయింది. కేవలం 11 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ సబ్జెక్టుకు రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకుంది. అందులో పేర్కొన్న మొబైల్ నంబరును సేకరించిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లు చేస్తూ వేధించసాగాడు.
 
పరీక్షల్లో పాస్ కావాలనుంకుంటే నాకు రూ.5 వేలు ఇవ్వు.. నా ప్రియురాలిగా మారు అంటూ సందేశం పంపాడు. ఆ వ్యక్తి ప్రతిపాదనను యువతి తిరస్కరించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే రీకౌటింగ్ ఫలితాల్లోనూ ఆ యువతి మళ్లీ ఫెయిల్ అయింది. తొలిసారి 11 మార్కులు రాగా, రీకౌంటింగ్‌లో సున్నా మార్కులు వచ్చాయి. ఇదంతా తనకు కాల్ చేసిన వ్యక్తే చేసివుంటాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.