శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:14 IST)

25 సంవత్సరాలు దాటితే టీకా.. రూ.6వేలు ఆర్థిక సాయం: సోనియాగాంధీ

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. కరోనాపై పోరాడే క్రమంలో కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నేడు వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించారు.
 
కరోనాను కాంగ్రెస్‌ పార్టీ ఓ జాతీయ స్థాయి సవాల్‌గా పరిగణించిందని.. పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిందని ఆమె తెలిపారు. భారత్‌లో మహమ్మారి ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి-మార్చి 2020 నుంచే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ అన్ని రకాలుగా సహకరించేందుకు ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఏడాది సన్నద్ధత ఉన్నప్పటికీ రెండో వేవ్‌ను నిలువరించడంలో ఘోరంగా విఫలమయ్యామని విచారం వ్యక్తం చేశారు.
 
ఏడాది సన్నద్ధత ఉన్నప్పటికీ రెండో వేవ్‌ను నిలువరించడంలో ఘోరంగా విఫలమయ్యామని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి బదులు కేంద్రమంత్రులు ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. అలాగే కరోనాపై పోరాడే క్రమంలో సాయం అర్థించిన కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిందన్నారు.

కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని.. కాంగ్రెస్‌ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై పూర్తి నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఈ కష్ట సమయంలో తన, మన భేదం లేకుండా రాజధర్మం పాటించాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ కొన్ని సూచనలు చేశారు. 25 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతించాలని కోరారు. అలాగే ఇటీవల కాంగ్రెస్‌, యూపీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. కరోనాను నిరోధించేందుకు కావాల్సిన వైద్య పరికరాలు, ఔషధాలు సహా ఇతరత్రా సహాయ సామగ్రిపై జీఎస్టీని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికీ మెడికల్‌ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలపై 12 శాతం జీఎస్టీ కొనసాగడం దురదృష్టకరమన్నారు.
 
తాజాగా మరోసారి విధిస్తున్న లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆమె అన్నారు. ఫలితంగా పేదలు, రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరి ఖాతాలో రూ.6,000 జమ చేయాలని కోరారు.