మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 జులై 2019 (12:11 IST)

మేమిద్దరం తిరుపతి వెంకటకవులం : జైపాల్‌తో స్నేహంపై వెంకయ్య నాయుడు

మా ఇద్దరినీ విపక్ష పార్టీల నేతలు తిరుపతి వేంకటకవులు అనే అని అనేవారనీ, ఎస్.జైపాల్ రెడ్డి తనకు మంచి మిత్రుడని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి శనివారం అర్థరాత్రి చనిపోయారు. దీంతో జైపాల్ రెడ్డి భౌతికకాయానికి ఉపరాష్ట్రపతి ఆదివారం నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ప్రతి క్షణం ప్రజలకోసమే కష్టపడ్డారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. జైపాల్‌రెడ్డి మంచి వక్త.. తెలుగు, ఆంగ్ల భాషల్లో వారి ప్రావీణ్యం అమోఘమని కొనియాడారు. ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో తమ ఇద్దరిదీ ప్రత్యేక పాత్ర అన్నారు. ఒకే బెంచ్‌లో కూర్చునేవాళ్లమని తెలిపారు. వాగ్ధాటితో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. తమను తిరుపతి వేంకట కవులతో పోల్చేవారన్నారు.
 
జైపాల్ రెడ్డి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణంతో పాటు, మాట్లాడే విధానం, వాగ్ధాటి తనకెంతో ఇష్టమని, అవే తమను మంచి మిత్రులగా మార్చిందని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆపై మంత్రిగా జైపాల్ వేసిన అడుగులు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని అన్నారు.
 
చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డా, అకుంఠిత దీక్షతో ఉన్నతమైన స్థాయికి జైపాల్ ఎదిగారని అన్నారు. తన అపారమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకునేలా విశ్లేషణ చేయగలగడం ఆయన సొంతమని, ఆంగ్ల భాషలో పట్టున్న నేతని కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా తొలిసారి పురస్కారాన్ని అందుకున్నది కూడా జైపాల్ రెడ్డేనని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
 
ప్రజాస్వామ్య వ్యవస్థకు జైపాల్‌రెడ్డి అధికప్రాధాన్యమిచ్చేవారని.. అపారమైన మేధస్సు, అందరినీ ఆకట్టుకునే విశ్లేషణ ఆయన సొంతమని వెంకయ్య అన్నారు. తమకు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రమాభినాలున్నాయని చెప్పారు. అనారోగ్యంతో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.